వైజాగ్ లోకల్ న్యూస్ - జాతీయం / హైదరాబాద్ : ఆదివాసీల హక్కుల విషయంలో మావోయిస్టులు చేసిన ఆరోపణలపై తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు. తన మూలాలను తాను ఎన్నడూ మరచిపోలేదని, ఆదివాసీల పక్షాన నిలబడతానని ఆమె స్పష్టం చేశారు. ములుగులో విలేకరులతో మాట్లాడిన ఆమె, మావోయిస్టులు తనపై చేసిన విమర్శలను ఖండించారు.
ఎవరైనా సరే వాస్తవాలు మాట్లాడాలని మావోయిస్టులకు పరోక్షంగా హితవు పలికారు. వివాదాస్పదంగా మారిన జీవో నంబర్ 49ను తాను వ్యతిరేకించిన విషయాన్ని మంత్రి సీతక్క గుర్తుచేశారు. కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఒకరిద్దరు అధికారులు మాత్రమే నిబంధనలు అతిక్రమిస్తున్నారని, మిగతా వారెవరూ ఆదివాసీలను ఇబ్బంది పెట్టడం లేదని ఆమె తెలిపారు. "ఆదివాసీల హక్కులకు భంగం కలిగించే జీవో 49ను నేను వ్యతిరేకించాను. ఈ విషయంపై మా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చించాను. అడవిలో ఆదివాసుల జోలికి వెళ్లవద్దని, వారిని ఇబ్బంది పెట్టవద్దని నేను, మరో మంత్రి కొండా సురేఖ కలిసి అటవీశాఖ అధికారులకు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం" అని ఆమె వివరించారు.
Vizag Local NewsAdmin