వైజాగ్ లోకల్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక చారిత్రక అధ్యాయం ప్రారంభం కానుందని, టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14న కీలక ఒప్పందం కుదుర్చుకోనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఇది తన రాజకీయ జీవితంలోనే ఒక అపూర్వ ఘట్టమని ఆయన అభివర్ణించారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలోకి గూగుల్ సంస్థ భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకురానుందని, దీని ఫలితంగా విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డేటా హబ్‌గా రూపాంతరం చెందనుందని తెలిపారు.
అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతిన్నదని, ఇప్పుడు దానిని పునర్నిర్మించి పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తున్నామని అన్నారు. ఒకవైపు డేటా సెంటర్, మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యం అందించేలా కరిక్యులమ్‌ను తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా కొందరు అడ్డుకోవడం, బెదిరింపులకు పాల్పడటం ఒక ఫ్యాషన్‌గా మారిందని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు నవంబర్‌లో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Vizag Local NewsAdmin