వైజాగ్ లోకల్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించామని, కార్యాచరణపై ప్రతి జిల్లాల్లో సమావేశం ఏర్పాటు చేశామని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సూచనలు తీసుకున్నామని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సోమవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 26 జిల్లాలకు సంబంధించి అందరితో మాట్లాడి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నామని, 2500 కిలోమీటర్లు ఈ జూన్ నెలలోనే తాను పర్యటించానని అన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా అందరితో స్వయంగా మాట్లాడానని, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా అడుగులు వేస్తామని షర్మిల అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, బీజేపీ సర్కార్, ప్రధాని మోదీ రాష్ట్ర విభజన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిలు బీజేపీని ప్రశ్నించే పరిస్థితిలో లేరని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్రమ పొత్తు పెట్టుకుంటే... చంద్రబాబు కూటమిలో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రం కోసం మోదీని నిలదీస్తోందని అన్నారు. కేంద్రంలో మోదీ అధికారంలో ఉన్నారంటే అందుకు చంద్రబాబే కారణమని, అయినా రాష్ట్రం కోసం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని విమర్శించారు.
Vizag Local NewsAdmin