వైజాగ్ లోకల్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : అధికారం చేతికి వచ్చిందన్న అలసత్వం ప్రదర్శించవద్దని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమ పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ పతనాన్ని ఉదాహరణగా చూపుతూ, అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన గట్టిగా హెచ్చరించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన, కూటమి ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు 'సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికీ తెలుగుదేశం' అనే కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, "151 సీట్లు గెలిచిన పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైందంటే దానికి వారి అహంకారమే ప్రధాన కారణం. మనం ఆ తప్పు చేయకూడదు. అధికారంలో ఉన్నప్పటికీ, ప్రతిపక్షంలో ఉన్నట్లే ప్రజలతో మమేకమవ్వాలి. వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగాలి" అని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో చారిత్రక విజయం వెనుక కార్యకర్తల అలుపెరగని శ్రమ ఉందని, కష్టపడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దని నేతలకు సూచించారు. ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు 'సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహించనున్నట్లు లోకేశ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విధిగా పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ విజయాలను వివరించాలని ఆదేశించారు.
Vizag Local NewsAdmin