వైజాగ్ లోకల్ న్యూస్ - జాతీయం / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మా రంగాల్లో దేశానికే తలమానికంగా నిలుస్తోందని, అలాంటిది గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారితే అది మనందరి వైఫల్యమే అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నాడు మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే డ్రగ్స్ మాఫియాకు గట్టి హెచ్చరిక చేశానని, తెలంగాణ గడ్డపై గంజాయి, డ్రగ్స్ వైపు కన్నెత్తి చూసినా వారి వెన్ను విరుస్తామని స్పష్టం చేశానని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘‘తెలంగాణ అంటేనే ఉద్యమాలు, పోరాటాలకు పురిటిగడ్డ. అలాంటి గడ్డ డ్రగ్స్‌కు నిలయంగా మారితే అది రాష్ట్రానికే అవమానకరం’’ అని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యార్థులు డ్రగ్స్ మహమ్మారి కోరల్లో చిక్కుకుంటున్నారని, ఇది దేశ భవిష్యత్తుకే ప్రమాదకరమని హెచ్చరించారు. శత్రుదేశాలు ఒక దేశాన్ని దెబ్బతీయడానికి ఎలాంటి మార్గాలైనా ఎంచుకోవచ్చని, కొవిడ్ లాంటి వైరస్‌లను లేదా డ్రగ్స్‌ను కూడా ప్రయోగించవచ్చని అభిప్రాయపడ్డారు. మాదకద్రవ్యాలు రవాణా చేసే వారు తెలంగాణ సరిహద్దుల్లోకి అడుగుపెట్టాలంటేనే వణికిపోయేలా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులకు, పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
Vizag Local NewsAdmin