వైజాగ్ లోకల్ న్యూస్ - జాతీయం / హైదరాబాద్ : పాట్నా: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ పై వైశాలి జిల్లాలోని రఘోపూర్లో కేసు నమోదైంది. రఘోపూర్ ప్రాంతంలో ప్రశాంత్ కిషోర్ శనివారంనాడు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనంతరం ఆయనపై స్థానిక సబ్-డివిజినల్ అధికారి ఈ ఫిర్యాదు నమోదు చేశారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు గట్టి పట్టున్న రఘోపూర్ నుంచి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రాహుల్ గాంధీ ఎలాగైతే అమేథీలో ఓడిపోయారో అలాగే తేజస్విని సొంత నియోజకవర్గంలోనే ఓడిస్తామని కిశోర్ తెలిపారు. 'మీ ఎమ్మెల్యే రెండు సార్లు ఉపముఖ్యమంత్రి అయ్యారు. మీ సమస్యలను ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు' అంటూ తన ఎన్నికల ప్రసంగంలో తేజస్విపై పీకే విమర్శలు గుప్పించారు.
దీనికి ముందు పాట్నా నుంచి రఘోపూర్‌కు ప్రశాంత్ కిశోర్ బయలుదేరుతూ, తేజస్వి ఈసారి రెండు సీట్లలో పోటీ చేస్తారని తెలుస్తోందని, ఆయనకు అంత భయమైతే రెండు చోట్లా పోటీ చేయవచ్చని, రాహుల్ గాంధీ 2019లో రెండు సీట్లలో పోటీ చేసిన అమేథీలో ఓడిపోయినట్టే రఘోపూర్‌లోనూ తేజస్వికి ఓటమి తప్పదన్నారు. తేజస్విపై పోటీ చేసే అవకాశంపై అడిగినప్పుడు సూటిగా సమాధానం ఇవ్వలేదు. జన్ సురాజ్ పార్టీ సెంట్రల్ కమిటీ ఆదివారంనాడు సమావేశమవుతుందని, రఘోపూర్ ప్రజల ఫీడ్‌బ్యాక్ ఆదారంగా తగిన అభ్యర్థిని ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు.
Vizag Local NewsAdmin